భారత భూభాగం(Territory)లోని ఏ ప్రాంతాన్ని పాకిస్థాన్ అని పిలవలేరు అంటూ హైకోర్టు జడ్జి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది దేశ ప్రాదేశిక సమగ్రత(Integrity)కి విరుద్ధమని చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టీకరించింది. కర్ణాటక హైకోర్టు జడ్జి చేసిన వివాదాస్పద కామెంట్స్ పై నివేదిక కోరిన బెంచ్.. కోర్టుల్లో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలకు స్పష్టమైన గైడ్ లైన్స్ రూపొందించాల్సిన అవసరముందని పేర్కొంది.
ఏం జరిగిందంటే…
కోర్టులో విచారణ సందర్భంగా భూస్వామి-కౌలుదారు వివాదాన్ని ప్రస్తావిస్తూ హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద… బెంగళూరులోని ముస్లింల మెజారిటీ ప్రాంతాన్ని పాకిస్థాన్ అని అభివర్ణించారు. ఒక మహిళా న్యాయవాదిపై విద్వేషపూరిత కామెంట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుప్రీం.. కర్ణాటక హైకోర్టు నివేదిక కోరింది. కోర్టు కార్యకలాపాల విషయంలో సోషల్ మీడియా చురుకైన పాత్ర పోషిస్తున్నప్పుడు కోర్టుల వ్యాఖ్యలు బాధ్యతగా ఉండాలని గుర్తు చేసింది. దీనిపై జస్టిస్ శ్రీశానంద్ బహిరంగ క్షమాపణలు చెప్పడంతో కేసు విచారణను ముగిస్తూ పై విధంగా స్పందించింది.