ఐదు సొసైటీల పరిధిలోని ఐదున్నర లక్షల మంది విద్యార్థులు, 30 వేల మంది సిబ్బంది(Staff) సమస్యలు పరిష్కరించాలంటూ గురుకులాల సిబ్బంది మహాధర్నా నిర్వహించారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో గురుకుల సంఘాల JAC, టీఎస్ యూటీఎఫ్ సంయుక్తంగా ధర్నాకు దిగాయి. పిల్లల మానసిక వికాసానికి అనుగుణంగా స్కూళ్ల పనివేళల్ని శాస్త్రీయంగా నిర్వహించాలన్న డిమాండ్ కు ముఖ్య అతిథి MLC అలుగుబెల్లి నర్సిరెడ్డి మద్దతు ప్రకటించారు. 2016-17లో ప్రారంభించిన 700 గురుకులాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని, మెస్ ఛార్జీలు ఎనిమిదేళ్లుగా పెరగకపోగా గతేడాది 25% పెంచుతున్నట్లు ప్రకటించినా ఇప్పటివరకు జీవో ఇవ్వలేదని పలువురు విమర్శించారు.
బోధనేతర భారంతో టీచర్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని, దీనిపై CM దృష్టిపెట్టి సమస్యలు పరిష్కరించేదాకా తమ పోరాటం ఆగదని JAC నాయకులు స్పష్టం చేశారు. మాజీ MP ఆర్.కృష్ణయ్య, JAC ఛైర్మన్ మారం జగదీశ్వర్, TNGO ప్రధాన కార్యదర్శి ముజీబ్, UTF ప్రధాన కార్యదర్శి చావ రవి, PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, AISF ప్రధాన కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, SFI నాయకుడు రజనీకాంత్.. గురుకుల సంఘాల నేతలు లక్ష్మారెడ్డి, కె.సంజీవ, ఎ.అజయ్ కుమార్, డి.ఎల్లయ్య, ఎస్.శ్యాంకుమార్ సహా పలువురు పాల్గొన్నారు.