తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి(Ghee) వ్యవహారంపై AP ఏర్పాటు చేసిన సిట్(SIT) ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలా లేదంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా అనే అంశంపై సుప్రీంకోర్టు అభిప్రాయం కోరింది. ఈ విషయంలో సహకరించాలని సొలిసిటర్ జనరల్(SG) తుషార్ మెహతాకు సూచిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడటం సరికాదన్న కోర్టు.. దీన్ని తాము సమర్థించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం కాబట్టి రాజకీయం చేయవద్దని సుప్రీం ఆదేశాలిచ్చింది. కల్తీ నెయ్యి వాడినట్లు నిర్ధారణ కానప్పుడు ఎందుకు అతిగా స్పందించారంటూ AP ప్రభుత్వాన్ని నిలదీసింది. ‘మీరు సిట్ వేశారు.. ఫలితం కోసం చూడకుండా మీడియాకు ఎందుకు లీక్ చేశారు.. రాజ్యాంగ పదవిని నిర్వహిస్తున్న మీరు ఇలా చేయడం సరికాదు.. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచండి..’ అని CM చంద్రబాబుపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది.