పేదలకు అందించే ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు(Orders) జారీ చేసింది. లబ్ధిదారుల(Beneficiaries) ఎంపిక, నిర్మాణాలపై అవగాహన, సోషల్ ఆడిట్, అధికారులతో సంప్రదింపుల కోసం ఎక్కడికక్కడే కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గ్రామాలు, పట్టణాల వారీగా కమిటీల్లో ఎవరెవరు ఉండాలనే దానిపై క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కేటాయించే 4.50 లక్షల ఇళ్ల కోసం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని సర్కారు అందించనుంది.
గ్రామాల్లో సర్పంచి/స్పెషల్ ఆఫీసర్ ఛైర్మన్ గా, పంచాయతీ సెక్రటరీ కన్వీనర్ గా ఉండే కమిటీలో మహిళా సంఘాల నుంచి ఇద్దరు.. BC, SC, STల్లో ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులుగా ఉంటారు. పట్టణాల్లో కౌన్సిలర్/కార్పొరేటర్ ఛైర్మన్ గా, వార్డ్ ఆఫీసర్ కన్వీనర్ గా.. మహిళా సంఘాల నుంచి ఇద్దరు.. BC, SC, STల్లో ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులుగా నియమితులవుతారు. ఈ పేర్లను MPDOలు, మున్సిపల్ కమిషనర్లు నామినేట్ చేస్తూ కలెక్టర్లకు సిఫార్సు చేయాలని, ఆ తర్వాత జిల్లా బాస్ లు ఆర్డర్స్ జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.