రాష్ట్రానికి ఉల్లి పంట పోటెత్తుతున్నా రేట్లు మాత్రం తగ్గడం లేదు. మహారాష్ట్ర, కర్ణాటక, APతోపాటు మన రాష్ట్రంలోని జిల్లాల నుంచి ఉల్లిగడ్డ మార్కెట్ కు చేరింది. ఈరోజు హైదరాబాద్ లో అత్యధికంగా క్వింటాలుకు రూ.5,000కు పైగా ధర పలికితే అత్యల్పంగా రూ.4,000 చెల్లించారు. వాతావరణం అనుకూలించడంతో ఈసారి భారీగా పంట చేతికి వచ్చింది. అత్యధికంగా సాగయ్యే మహారాష్ట్రలో మొన్నటి వర్షాలకు పంట దెబ్బతినడంతో ఐదారు నెలలుగా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.70 దాకా పలుకుతుండగా, కాస్త నాణ్యత లేని ఉల్లి మాత్రం రూ.40-50కి అమ్ముడవుతున్నది.
అయితే ధరలు తగ్గకపోవడానికి రాజకీయ కారణాలేనని వ్యాపారులు అంటున్నారు. ఉల్లి ఎగుమతుల(Exports)పై కేంద్రం నిషేధం(Ban) విధించడంతోపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయితే రేట్లు తగ్గుతాయంటున్నారు. మన రాష్ట్రంలో వనపర్తి జిల్లా వీపనగండ్ల సహా రెండు మండలాల్లో కృష్ణానది బ్యాక్ వాటర్ భూముల్లో పంట పండిస్తారు. తెలంగాణ నుంచీ ఈసారి పంట బాగా వస్తున్నట్లు చెబుతున్నారు.