ఆడుతుంది తొలి టెస్ట్… క్యాప్ అందుకుని ఒక్క పూట గడవకుండానే బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. అప్పటికే ఆరు వికెట్లు ఫట్. మిగిలిన సీనియర్ బ్యాటర్ రిషభ్ ఒక్కడే. తనకు దారి చూపుతాడనుకున్న అతడు కూడా ఎక్కువ సేపు నిలవలేదు. జూనియర్ గా తొలి మ్యాచ్ బరిలోకి దిగిన అతడు.. ఆ క్షణంలోనే సీనియర్ అయిపోయాడు. తన తర్వాత ఇక స్పెషలిస్ట్ బ్యాటర్లే లేకపోవడంతో పెద్ద బాధ్యత మీద పడింది. కానీ ఆశల్ని వమ్ము చేయకుండా ఆకట్టుకునేలా ఆడి ఆశ్చర్యపరిచాడు హైదరాబాదీ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.
పంత్ కు దీటుగా బ్యాటింగ్ చేసిన నితీశ్.. రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. అయినా తన బ్యాటింగ్ మ్యాజిక్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇప్పటికే IPL, ఇంటర్నేషనల్ టీ20ల్లో అదరగొట్టిన ఈ బ్యాటింగ్-పేస్ ఆల్ రౌండర్.. చివరి దశలో ధాటిగా బ్యాటింగ్ చేయాలన్న కోణంలోనే క్యాచ్ ఇచ్చాడు. టెయిలెండర్లు బుమ్రా, హర్షిత్ ఔటవడంతో ఒక్క సిరాజ్ మాత్రమే తోడుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక బ్యాట్ కు పనిచెప్పడమే అని భావించిన నితీశ్.. షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. సీనియర్లందరిలో ఇద్దరు డకౌట్, మరో నలుగురు సింగిల్ డిజిట్ కే పరిమితమైన పరిస్థితుల్లో టాప్ స్కోరర్ గా నిలిచి శభాష్ అనిపించాడు.