పదోతరగతి పరీక్షల మార్కుల విధానంలో మార్పులు తీసుకువస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్(Internal) మార్కుల్ని ఎత్తివేస్తూ ఇక నుంచి 100 మార్కుల(ఒక్కో పేపర్)కు పరీక్షలు(Exams) జరగనున్నాయి. గ్రేడింగ్ పద్ధతిని ఎత్తివేయడంతోపాటు ఇకపై విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆన్సర్ షీట్లకు దారాలు కట్టే బదులు ఇకనుంచి బుక్ లెట్ ఇవ్వబోతున్నారు. ఈ విద్యాసంవత్సరం 2024-2025 నుంచి ఇంటర్నల్ మార్కుల ఎత్తివేత నిర్ణయం అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా పరీక్ష మార్కులు 80 ఉంటే, ఇంటర్నల్ మార్కులు 20 ఉండేవి. తాజా నిర్ణయంతో మొత్తం 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరుగుతాయి.
సైన్స్ లో భౌతిక, జీవశాస్త్రాలున్నందున ఒక్కో పేపర్ కు 50 మార్కులు కేటాయిస్తారు. సర్కారీ బడుల్లో నిక్కచ్చిగా ఇంటర్నల్ మార్కులు వేస్తుండగా, ప్రైవేటులో మాత్రం 20కి 20 వేస్తుండటం వల్ల తేడాలొస్తున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలో పదో తరగతి గ్రేడ్ల ఆధారంగా బీటెక్(ఇంటర్ రెండేళ్లు, డిగ్రీ నాలుగేళ్లు) సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివినవారికి 0.4 శాతం అదనంగా కలిపి సీటు ఇస్తారు. ప్రైవేటులో చదివి 10 GPA తెచ్చుకుంటే సీటు ఇస్తుండగా, ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు 9.6 GPAనే లెక్కలోకి తీసుకుంటారు. ఇప్పుడు గ్రేడింగ్ తీసివేయడంతో సర్కారీ స్కూళ్లకు అదనపు మార్కులు ఎలా ఇస్తారో చూడాలి.