సౌర తుపాన్లు ఎలా వస్తాయి.. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడితే సూర్యుడి మధ్యభాగం ఒకలా, ధ్రువ భాగం ఒకలా తిరగడానికి కారణం ఏంటి.. 10 లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఎలా సాధ్యమైంది అన్న అంశాలపై పరిశోధన కోసం PSLV సీ-59 ప్రోబా-3 ఉపగ్రహాల్ని కక్ష్య(Orbit)లోకి పంపించారు. ఈ ప్రయోగం వల్ల సూర్యుడి కరోనాలో దాగున్న విషయాలన్నీ బయటపడే అవకాశాలున్నాయి. ఇదంతా ఎలా చేస్తారంటే…
సాధారణంగా సూర్యగ్రహణం కేవలం 10 నిమిషాల పాటే ఉంటుంది. 10 నిమిషాల తర్వాత చంద్రుడి కదలిక ద్వారా గ్రహణం వీడటంతో తేజోవంతమైన వెలుగు ద్వారా కరోనా గ్రాఫ్ తీయడానికి వీలు పడదు. అందుకే కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించి కరోనాను శోధించడం ప్రోబా-3 ప్రత్యేకత. ఫార్మేషన్ ఫ్లైయింగ్ లో భాగంగా 6 గంటలు ఉండే కృత్రిమ గ్రహణాన్ని సృష్టిస్తారు. సూర్యుడి ఉపరితలం 5,500 డిగ్రీల ఉష్ణోగ్రత కాగా, అక్కణ్నుంచి 70 వేల కిలోమీటర్ల దూరాన గల కరోనాలోని ఉష్ణోగ్రత 10 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్లు ఉంటుంది. ఈ కృత్రిమ వాతావరణం(గ్రహణం) వారానికి రెండు సార్లు, నెలకు 8 సార్లు ఏర్పడటం ద్వారా నిరంతర పరిశోధనలు చేస్తారు.
సూర్యుడి మధ్యభాగం తన చుట్టూ తాను తిరగడానికి 25 రోజులు తీసుకుంటే, ధ్రువభాగం తిరగడానికి 36 రోజులు పడుతుంది. భూమిలోని ఏ ప్రాంతమైనా 24 గంటలే తిరుగుతుండగా, భానుడిలో ఈ తేడా ఎందుకు.. సూర్యగోళంలోని అంతరార్థమేంటి.. అనే వాటిపైనే తాజా ప్రయోగం చేశారు. సోలార్ సైకిల్ ప్రతి 11 ఏళ్లకోసారి ఏర్పడగా, ఇది 11వ సంవత్సరం కాబట్టి సూర్యుని ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల ఇది అనుకూల సమయంగా భావించి పరీక్షలు జరిపారు. అక్కడ ఉత్తర-దక్షిణ ధ్రువాలు మార్పు(Flip) చెందుతూ ఉంటాయి. సూర్యుడి మధ్యభాగం, ఉపరితలం, కరోనా, కరోనాలో ఏర్పడే లక్షణాలు, వాటి వల్ల భూమికి గల ముప్పు, ఆయస్కాంత తుపాన్లు వచ్చే సమయంలో తీసుకునే జాగ్రత్తలపై ఈ పరిశోధన ఉపయోగపడనుంది.