ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సీనియర్(Senior) జట్టు పరాజయం పాలైతే అండర్-19 కుర్రాళ్లు కూడా అసలు పోరు(Final)లో చేతులెత్తేశారు. ఆసియా కప్ లో భాగంగా దుబాయిలో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా.. ప్రత్యర్థిని 49.1 ఓవర్లలో 198కే ఆలౌట్ చేసింది. రిజాన్(47), షిహాబ్(40), ఫరీద్(37) టాప్ స్కోరర్లు. గుహ, చేతన్, హార్దిక్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. తక్కువ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 92 స్కోరుకే 7 వికెట్లు చేజార్చుకుంది.
మహత్రే(1), వైభవ్(9), సిద్ధార్థ్(20), కార్తికేయ(21), నిఖిల్(0), హర్ వంశ్(6) తొందరగా ఔటవడంతో 35.2 ఓవర్లలో 139కే ఆలౌటై 59 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఈ టోర్నీలో బంగ్లా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగింది. ఆసియాకప్ లో ఇప్పటివరకు ఆ టీమ్ 3 సార్లు ఫైనల్ చేరితే 2019 మినహా రెండుసార్లు విజేతగా నిలిచింది. భారత్ 9 సార్లు ఫైనల్ చేరితే 8 సార్లు కప్పును గెలుచుకుంది.