వరకట్న(Dowry) వేధింపుల కేసులపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. చట్టాన్ని దుర్వినియోగం(Misuse) చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సరైన ఆరోపణల్లేని కంప్లయింట్లను మొదట్లోనే తుంచివేయాలని స్పష్టం చేసింది. బాధితురాలు అంటూ భార్య ద్వారా వ్యూహాలు పన్నడాన్ని అనుమతించొద్దని ఆదేశించింది. వీటిపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వివాహ సంబంధ వివాదమైన క్రిమినల్ కేసుల్లో కుటుంబ సభ్యుల పేర్లను లాగడం, భర్తల సంబంధీకులందర్నీ చేర్చడాన్ని తప్పుబట్టింది. నిర్దిష్ట సాక్ష్యం(Evidence) లేని ఆరోపణలు క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు ఆధారం కాబోవని క్లారిటీ ఇచ్చింది.
నిబంధనల్ని దుర్వినియోగం చేయకుండా, అమాయక కుటుంబ సభ్యులపై అనవసర వేధింపులను నివారించడానికి ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలని బెంచ్ అభిప్రాయపడింది. IPC సెక్షన్ 498A అనేది భర్త, అతడి కుటుంబ సభ్యుల క్రూరత్వాన్ని అడ్డుకునేందుకు ఉపయోగించే సాధనమన్న కోర్టు.. అది మిస్ యూజ్ కాకూడదని చెబుతూనే ఈ మధ్యకాలంలో ఇది విచ్చలవిడిగా దుర్వినియోగమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. నిజమైన ప్రేమ ఉన్నా ఇలాంటి తప్పుడు కేసుల వల్ల అది వ్యక్తిగత ద్వేషాలకు దారితీస్తుందని, తద్వారా భార్యభర్తనే కాకుండా ఆ కుటుంబాన్నే విచ్ఛిన్నం చేస్తుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే క్రూరత్వానికి గురైన ఏ మహిళైనా మౌనంగా ఉండాలని, ఫిర్యాదు లేదా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను మానుకోవాలని చెప్పడం తమ ఉద్దేశం కాదన్న బెంచ్.. అస్పష్ట ఆరోపణలున్నప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.