దేశంలో విమానయాన రంగం(Aviation) అంతకంతకూ వృద్ధి చెందుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో దేశీయంగా(Domestic) ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ప్రయాణాలు చేసినట్లు కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నవంబరు 17న 5 లక్షల మంది విమానాల్లో ప్రయాణించగా, అక్టోబరులో దేశీయ విమానయాన రంగంలో 5.3 శాతం పెరుగుదల నమోదైంది. సెప్టెంబరులో 1.26 కోట్ల మంది ప్రయాణిస్తే అక్టోబరులో అది 1.36 కోట్లకు చేరుకుంది. విమానయానం ఇక ఏ మాత్రం లగ్జరీ కాదన్న మంత్రి.. రానున్న రోజుల్లో మరో 50 ఎయిర్ పోర్టులు వస్తాయన్నారు. 2014లో NDA అధికారంలోకి వచ్చిన సమయంలో 74 విమానాశ్రయాలుంటే ఇప్పుడవి 157కు చేరుకోగా, మరో మూడు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రాబోయే ఐదేళ్లలో మిగతా 50 ఎయిర్ పోర్టుల ద్వారా విమాన సేవల్ని మరింత పెంచబోతున్నారు.