ఉద్యోగుల హాజరు(Attendance) విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. రాష్ట్రానికి గుండెకాయలా భావించే సచివాలయంలోనే ముందుగా సరికొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. రేపటి(డిసెంబరు 12) నుంచి సెక్రటేరియట్లో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ను వర్తింపజేయబోతున్నారు. ఉన్నతాధికారి నుంచి ఔట్ సోర్సింగ్ సిబ్బంది వరకు వేతనాలు(Salaries) పొందే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఫేషియల్ అటెండెన్స్ అమల్లో ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) శాంతికుమారి తెలియజేశారు. పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు సాయంత్రం విధులు ముగించి వెళ్లేటప్పుడు ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఈ విధానం సెక్రటేరియట్లో సక్సెస్ ఫుల్ అయితే రాష్ట్రమంతా వర్తింపజేసే అవకాశాలున్నాయి.