ఓపెన్ఏఐ(OpenAI) ఆధ్వర్యంలోని చాట్ జీపీటీ(ChatGPT) సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటలకు సమస్య తలెత్తినట్లు వినియోగదారులు గుర్తించారు. ఈ విషయాన్ని పలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా పంచుకున్నారు. చాట్ జీపీటీతోపాటు ఓపెన్ఏఐకి చెందిన API, సొర వంటి సేవలు కూడా అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. చాట్ జీపీటీతోపాటు తమ అనుబంధ సంస్థల్లో తలెత్తిన ఇబ్బందులను అంగీకరించిన ఓపెన్ఏఐ.. ‘X’లో పోస్ట్ చేసింది. ‘ప్రస్తుతం కంపెనీ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాం.. దాన్ని పరిష్కరించే మార్గంలో ఉన్నాం.. మీకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు తెలియజేస్తున్నాం.. ఈ అంశంపై త్వరలోనే మీకు అప్డేట్ అందిస్తాం..’ అన్నది సారాంశం. అయితే సమస్య తలెత్తిన ఐదున్నర గంటల తర్వాత దాన్ని పునరుద్ధరించినట్లు(Recover) మరోసారి ఓపెన్ఏఐ.. ‘X’లో ట్వీట్ ద్వారా తెలియజేసింది.