తరచూ బెదిరిస్తూ తమ గడ్డను వేదికగా చేసుకుని భారత్ పై నిఘా పెట్టాలనుకున్న చైనా(China)కు శ్రీలంక షాకిచ్చింది. భారతదేశ భద్రతకు హాని కలిగించే ఎలాంటి చర్యనైనా అనుమతించబోమంటూ లంక హామీ(Assurance) ఇచ్చింది. భారత్ ను టార్గెట్ చేసుకున్న చైనా.. ‘మిషన్ హిందూ మహాసముద్రం’ పేరిట దూకుడు చూపించింది. తమకు చెల్లించాల్సిన బాకీ కింద లంకలోని హంబన్ టోట నౌకాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్న డ్రాగన్.. గూఢచారి నౌకల్ని మోహరించి భారత వ్యవస్థల్ని ట్రాక్ చేయాలని చూసింది. 25 వేల టన్నుల బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ షిప్ అయిన యువాన్ వాంగ్-5ని రెండేళ్ల నుంచి పోర్టులో ఉంచి చైనా నౌకలు ట్రాకింగ్ కు యత్నిస్తున్నాయి. ఈ హంబన్ టోట పోర్టు భారతదేశానికి సమీపంలో ఉండటంతో.. బలమైన ట్రాకింగ్, కమ్యూనికేషన్ రిలే సిస్టంతో.. మన దేశ వ్యవస్థలపై గురిపెట్టింది.
2022 ఆగస్టులో మొదలైన బీజింగ్ ట్రాకింగ్ పై అప్పట్లోనే మోదీ సర్కారు అభ్యంతరం తెలిపింది. అయితే చైనాకు బాకీ చెల్లించే పరిస్థితి లేక ఆడమన్నట్లు ఆడాల్సి వచ్చింది లంకకు. కొలంబో ఓడరేవు నిర్మాణం కోసం చైనా నుంచి 1.7 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంటే దాని కోసం ఏటా 100 మిలియన్ల డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు లేకపోవడంతో 99 సంవత్సరాల లీజుకు హంబన్ టోట పోర్టును చైనా స్వాధీనం చేసుకుంది. కానీ మోదీతో చర్చించిన లంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయక.. 2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభంలో భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. భారత్-లంక సంబంధాలే ముఖ్యమంటూ చైనా ఆధిపత్యాన్ని ఒప్పుకోబోమని హామీ ఇచ్చారు. ఇక నుంచి హంబన్ టోట పోర్టు నుంచి చైనా కార్యకలాపాల్ని సాగనివ్వబోమని స్పష్టతనివ్వడం భారత్-లంక ద్వైపాక్షిక సంబంధాలకు మరింత బలం చేకూరిందని నిపుణులు అంటున్నారు.