కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి(I.N.D.I.A. Alliance)లో మరో చిచ్చు మొదలైంది. రాహుల్-మమత నాయకత్వాలపై అలయెన్స్ లో రచ్చ మొదలవగా ఇప్పుడు ఈవీఎంల అంశం రచ్చగా మారింది. హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ… EVMలపై అనుమానాలు లేవనెత్తి ఎన్నికల సంఘానికి కంప్లయింట్ చేసింది. జమ్మూకశ్మీర్లో ఈ మధ్యనే అధికారం చేపట్టిన ఒమర్ అబ్దుల్లా.. తమ కూటమిలోని కాంగ్రెస్ విధానాన్ని తప్పుబట్టారు. గెలిస్తే ఒకలా, ఓడితే ఒకలా మాట్లాడితే ఎలా.. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఇవే ఈవీఎంలను ఉపయోగించి 99 స్థానాలు గెలిచి సంబరాలు చేసుకున్నప్పుడు గుర్తుకు రాలేదా.. ఓటింగ్ పద్ధతిని విశ్వసించకపోతే ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పడం సంచలనంగా మారింది.
ఇప్పుడు ఒమర్ మాదిరిగానే తృణమూల్ ఎంపీ, మమతా బెనర్జీ తర్వాత నంబర్-2 అయిన అభిషేక్ బెనర్జీ సైతం కాంగ్రెస్ ను విమర్శించారు. ఈవీఎంలపై అనుమానం ఉన్నవారు వాటిని ఎలా హ్యాక్ చేస్తారో చూపించాలి.. కేవలం ప్రకటనల ద్వారా ఆరోపణలు చేస్తే లాభం ఉండదు.. అని అనడంతో కాంగ్రెస్ కూటమి ఉలిక్కిపడినట్లయింది. ఇప్పటికైనా తృణమూల్ అధినేతకు జ్ఞానోదయమైందని కేంద్ర మంత్రి సతీశ్ చంద్ర దూబె అన్నారు. ఒకరోజు ఓటర్లు మమ్మల్ని ఓడిస్తారు.. మరోసారి గెలిపిస్తారు.. నేను ఓటింగ్ మిషన్లను ఎప్పుడూ తప్పుబట్టను అని ఒమర్ అబ్దుల్లా అన్నట్లుగానే TMC నేత అభిషేక్ చెప్పడంతో.. కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. అసలే తనకు మమత పోటీగా మారడానికి తోడు ఇలా వరుసగా వివాదాలు ఏర్పడటంతో హస్తం పార్టీ అయోమయంలో పడిపోయింది.