రెండోసారి అధికారం(Power) చేపట్టేముందు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఝలక్.. కెనడాను ఉక్కిరిబిక్కిరి చేసింది. ట్రంప్ తీరును విభేదించిన కెనడా ఉప ప్రధాని.. ఈ విషయంలో తమ ప్రధాని జస్టిన్ ట్రూడో తీరు నచ్చక రాజీనామా చేశారు. కెనడియన్ దిగుమతుల(Imports)పై 25 శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటన కెనడాలో అలజడి రేపింది. కెనడా ప్రధాన వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాకు 75 శాతం ఎగుమతులుంటున్నాయి. దీంతో తమ దేశం తీవ్రమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందంటా కెనడా డిప్యూటీ PM క్రిస్టియా ఫ్రీలాండ్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆర్థిక మంత్రి కూడా అయిన ఆమె.. ట్రూడోకు వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించిన నేతగా నిలిచారు.
భారత్ తో వైరం వంటి అంశాలతో ఇప్పటికే లిబరల్ పార్టీ నేత ట్రూడో.. కన్జర్వేటివ్ అభ్యర్థి కంటే 20 పాయింట్ల వెనుకంజలో ఉన్నారు. దీంతో ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్న దశలో ఆయనకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మాజీ జర్నలిస్టయిన ఫ్రీలాండ్ 2013లో తొలిసారి ఎన్నికవగా.. గతంలో వాణిజ్య, విదేశాంగ మంత్రులుగా పనిచేశారు. ట్రంప్ సుంకాల బెదిరింపును అత్యంత తీవ్రంగా భావించాల్సి ఉందంటూ ఇది USతో ‘టారిఫ్ వార్’కు దారితీస్తుందని, మనం భరించలేని స్థాయికి వెళ్లాల్సి రావొచ్చని ఫ్రీలాండ్ హెచ్చరించారు. డిప్యూటీ PM నిష్క్రమణ దేశ విపత్తుగా అభివర్ణిస్తున్నారు కెనడా నిపుణులు. ట్రూడోపై విశ్వాసం సంక్షోభంలో ఉన్న దృష్ట్యా ఫ్రీలాండ్ తప్పుకోవడం దానికి మరింత బలం చేకూర్చిందంటున్నారు.