‘జైశ్రీరామ్’ అని నినదించడం ఏదైనా క్రిమినల్ చర్యనా అంటూ సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఏదైనా మతానికి చెందిన పేరును కానీ, నినాదాన్ని ఉచ్ఛరించడం తప్పు ఎలా అవుతుందని అభిప్రాయపడింది. కేసు వివరాల్లోకి వెళ్తే…
మసీదులో జైశ్రీరామ్ అన్న నినాదాలు చేశారంటూ ఇద్దరు వ్యక్తులపై కర్ణాటక(Karnataka)లో కేసు ఫైల్ అయింది. పుత్తూర్ సర్కిల్లోని కడబ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 సెప్టెంబరు 24 ఘటన జరిగినట్లు కేసు పెట్టారు. నినాదాలు చేస్తూ బెదిరించిన ఆ ఇద్దరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు 2024 సెప్టెంబరు 13న కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైదర్ అలీ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం.. పిటిషనర్ సహా కర్ణాటక పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది.
‘జైశ్రీరామ్’ నినాదం చేయడం నేరమా.. ఆ ఇద్దరు మసీదులోకి ప్రవేశించారని ఎవరు గుర్తించారు.. CCTV ఫుటేజ్ లో ఉన్నారని మీరు గుర్తు పట్టారా.. మసీదు లోపలికి వచ్చినట్లు ఎవరు నిర్ధారించారు.. అంటూ పిటిషనర్ తరఫు అడ్వొకేట్ దేవదత్ కామత్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు పూర్తిస్థాయి విచారణ నిర్వహించకుండానే హైకోర్టు కేసు కొట్టివేసిందని కామత్ వివరించారు. మరొకరి మత ప్రాంతంలో నినాదాలు ఇవ్వడం విద్వేషాలను రెచ్చగొట్టడమేనంటూ.. మసీదులోకి చొరబడ్డట్లు FIR నమోదు చేశారని దీనిపై పోలీసులే సమాధానం ఇవ్వాలని న్యాయవాది అన్నారు. ఎఫ్ఐఆర్ అనేది ఎన్ సైక్లోపీడియా కాదు కదా అని కోర్టు మరోసారి ప్రశ్నిస్తూ తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. ‘జైశ్రీరామ్’ స్లోగన్ల వల్ల మతపరమైన విభేదాలొచ్చాయా.. దీనివల్ల ప్రజల మధ్య గొడవలు జరగలేదు కదా అంటూ అంతకుముందు హైకోర్టు.. కేసును కొట్టి వేసింది.