బాకీల కన్నా రెండు రెట్లు రికవరీ చేసినా ఇంకా నేరస్థుణ్నేనా అంటూ విజయ్ మాల్యా ప్రశ్నించారు. రూ.14,131 కోట్లు రికవరీ చేశామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రస్తావించడంపై ఆయన ట్వీట్ చేశారు. ‘కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రుణం రూ.6,203 కోట్లుగా డెట్ రికవరీ ట్రైబ్యునల్ నిర్ధారించింది.. ఇందులో రూ.1,200 కోట్ల వడ్డీ ఉంది.. బ్యాంకులు, ED కలిసి రెండు రెట్లకుపైగా తన నుంచి ఎందుకు ఎక్కువ తీసుకున్నాయో చెప్పాలి.. కట్టాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకున్నా ఇంకా ఆర్థిక నేరస్థుడని అంటున్నారు.. నాకు ఎవరి నుంచి మద్దతు లేదు.. ఎవరైనా నాకు అండగా ఉండి ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తారా.. అపవాదుకు గురైన తనకు మద్దతివ్వడానికి చాలా ధైర్యం కావాలి..’ అన్నది ఆయన ట్వీట్ సారాంశం.
తాను ఒక్క రూపాయి రుణం తీసుకోలేదన్న మాల్యా.. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రుణానికి పూర్తి వడ్డీ చెల్లించానన్నారు. CBI క్రిమినల్ కేసులున్నాయని ప్రభుత్వంతోపాటు పలువురు విమర్శిస్తున్నారు. మోసం, నిధుల దుర్వినియోగంపై తొమ్మిదేళ్లు గడిచినా కచ్చితమైన ఆధారాలు ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. గ్రాంట్లకు సంబంధించిన చర్చ సందర్భంగా మాల్యా ఆస్తుల రికవరీ గురించి నిర్మల మాట్లాడారు.