పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stamped)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిజాల్ని తెలియజేశారు. హీరో, హీరోయిన్, నిర్మాత వస్తున్నందున బందోబస్తు ఇవ్వాలంటూ ఈనెల 2న చిక్కడపల్లి పోలీసులకు లెటర్ పెట్టుకున్నారని, కానీ ఈనెల 3న ఆ వినతిని పోలీసులు తిరస్కరించారన్నారు. కానీ 4 నాడు ఎలాంటి సమాచారం లేకుండా అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడిందన్నారు. సంధ్య థియేటర్ కు ఉన్నది ఒకే ఒక్క గేట్ కావడం, మిగతా థియేటర్లలోని అభిమానులంతా అర్జున్ ను చూడటానికి ఎగబడటంతో గందరగోళం ఏర్పడి తోపులాట జరిగిందన్నారు. ఈ ఘటనలో రేవతితోపాటు ఆమె కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని శాసనసభలో ప్రకటించారు.
‘సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు.. తొక్కిసలాటలో తల్లిని కోల్పోయి కోమాలో ఉన్న బాలుణ్ని ఈ సినీ ప్రముఖులు పరామర్శించారా.. అతను ఒక్కరోజు జైలుకు వెళ్తే ఇంతమంది పరామర్శించిండ్రు.. కారులో వచ్చి కారులో వెళ్తే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు.. కానీ రూఫ్ టాప్ ఓపెన్ చేసి హీరో థియేటర్లోకి వెళ్లడంతో వేలాదిమంది జమైండ్రు.. హీరోను ఓదార్చిన వారిలో ఒక్కరు కూడా బాలుణ్ని పరామర్శించలేదు.. తిరిగి ప్రభుత్వాన్ని, నన్ను బద్నాం చేస్తున్నారు.. మానవత్వం లేని వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.. ఆ హీరో దైవస్వరూపుడు, ఆయన్ను ముట్టుకుంటారా అంటూ ఒక నేత ట్వీట్ చేశారు.. సీఎంనైన నన్ను ఈ ఘటనపై నీచంగా తిట్టారు.. హీరోను చూడ్డానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రముఖులు.. కోమాలో ఉన్న బాలుణ్ని ఎందుకు చూడలేదు..’ అని రేవంత్ ఆగ్రహంగా మాట్లాడారు.