అల్లు అర్జున్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంధ్య థియేటర్(Sandhya Theatre) లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడానికి ఆయనే కారణమంటూ ఉస్మానియా యూనివర్సిటీ(OU) జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఇంటి గేటు దూకి లోపలికి చొరబడ్డ నిరసనకారులు.. పూలకుండీల్ని పగులగొట్టారు. బాధితురాలి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ రాళ్లు విసిరారు. వీరిని అల్లు అర్జున్ సెక్యూరిటీ అడ్డుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాడి జరిగిన సమయంలో అల్లు కుటుంబ సభ్యులెవరూ బయట కనిపించలేదు. ఆందోళనకారుల్ని అరెస్టు చేసిన తర్వాత అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడకు చేరుకుని ఇంటిని పరిశీలించారు.