ఉపాధ్యాయుల బదిలీలపై విధించిన స్టేను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈనెల 26 వరకు పొడిగించింది. బదిలీల నిబంధనలు రూపొందిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 5, సవరణ జీవో 9ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఉపాధ్యాయ సంఘాల ఆఫీస్ బేరర్లతోపాటు దంపతులకు బదిలీల్లో ప్రత్యేక పాయింట్లు కేటాయించడంపై పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బదిలీలను నిలిపివేస్తూ ఫిబ్రవరిలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వుల వల్ల పదోన్నతులు నిలిచిపోయాయని, దాన్ని ఎత్తివేయాలని కోరుతూ కొంతమంది టీచర్లు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషన్లపై ఈ నెల 26న విచారణ చేపడతామని, సర్కారు సహా అన్ని పక్షాలు వాదనలకు సిద్ధంగా ఉండాలని ధర్మాసనం ఆదేశించింది.