పోలీసుల విచారణ కోసం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా అర్జున్ నివాసమైన జూబ్లీహిల్స్ తోపాటు చిక్కడపల్లి వద్ద భారీగా బందోబస్తు(Security) ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఈ సినీ నటుణ్ని A11గా పెట్టారు. ఇప్పటికే ఆయన్ను రిమాండ్ కు తరలిస్తే హైకోర్టు మధ్యంతర బెయిల్ తో జైలు నుంచి బయటకు వచ్చారు. CM రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తొక్కిసలాట అంశం ప్రస్తావించిన తర్వాత అదేరోజు సాయంత్రం అర్జున్ ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలపైనా ACP ఆధ్వర్యంలోని టీమ్ ప్రశ్నలు అడిగి వాంగ్మూలం(Statement) రికార్డు చేయనున్నారు.
థియేటర్ నుంచి వెళ్లిపోవాలని చెప్పినా వినలేదని పోలీసులు.. వెంటనే అక్కణ్నుంచి వెళ్లిపోయానని ఈ కథానాయకుడు.. ఇరు వర్గాల వాదనల నడుమ పోలీసులు రిలీజ్ చేసిన వీడియోతో అసలు విషయం వెలుగులోకి రావడంపైనా ప్రశ్నలు ఉండనున్నాయి. అభిమానులు పెద్దయెత్తున వచ్చే ఛాన్స్ ఉండటంతో అటువైపుగా ఎవరూ రాకుండా భారీస్థాయిలో పోలీసులు పహారా కాస్తున్నారు. అర్జున్ వెంట ఆయన తండ్రి అరవింద్, మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితోపాటు న్యాయవాదులు ఉన్నారు.