
చంద్రయాన్-3 రాకెట్ విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. ఆగస్టు 23 లేదా 24న జాబిల్లి(Moon)పై అడుగుపెట్టనున్నట్లు ఇస్రో(ISRO) ఛైర్మన్ ప్రకటించారు. LVM-3 M4 నుంచి సక్సెస్ ఫుల్ గా ఉపగ్రహం విడిపోయింది. విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లటంతో శాస్త్రవేత్తలతోపాటు అందరిలోనూ ఆనందం వెల్లివిరిసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగనున్న చంద్రయాన్-3 ల్యాండర్… మరో 40 రోజుల్లో చంద్రునిపై అడుగుపెట్టనుంది. త్వరలోనే చంద్రుడిని చేరుకుంటామని శాస్త్రవేత్తలు అన్నారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనం ఆ స్థాయికి చేరుకున్నామని స్పేస్ రంగ నిపుణులు అంటున్నారు.
ఈ రాకెట్ 24 రోజుల పాటు భూమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా దీని కక్ష్యను పెంచుతూ చంద్రుడి దిశగా ప్రయాణించే దిశగా కక్ష్యలోకి చేరుస్తారు. ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్ తో కూడిన మాడ్యూల్ విడిపోయి చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరువలో దిగనుందని ఇస్రో(ISRO) తెలిపింది.
ప్రధాని అభినందనలు
చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో సైంటిస్టులను(Scientists) అభినందించారు. ఇండియన్ స్పేస్ హిస్టరీలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారని అన్నారు. ప్రతి భారతీయుడి కలలు, ఆశయాలను చంద్రయాన్-3 ఉన్నతంగా తీసుకెళ్తుందని ప్రధాని ఆకాంక్షించారు. ఈ గొప్ప విజయం శాస్త్రవేత్తల అంకితభావానికి నిదర్శనమని.. వారి స్ఫూర్తి, చాతుర్యానికి నమస్కరిస్తున్నట్లు ఫ్రాన్స్ నుంచి ట్వీట్ చేశారు.