ఎంత అప్రమత్తం(Alert)గా ఉంటున్నామని చెబుతున్నా చైనా కొత్త వైరస్ దేశంలోకి ప్రవేశించింది. ఇద్దరు పసికందుల్లో(Infants) వైరస్ గుర్తించడం సంచలనంగా మారింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో మూడు, ఎనిమిది నెలలు వయసున్న ఇద్దరు చిన్నారుల్లో హ్యూమన్ మెటాన్యుమో వైరస్(hMPV) ఉందని పరీక్షల్లో తేలింది. ఇందులో 3 నెలల పసికందును డిశ్చార్జి చేయగా, మరో చిన్నారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ పిల్లల కుటుంబాలకు ఏ దేశానికి వెళ్లిన చరిత్ర లేకపోవడమే.
hMPV వ్యాపిస్తుందన్న అనుమానాల దృష్ట్యా అనారోగ్యానికి గురైన ఆ ఇద్దరికీ ICMR(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిబంధనల ప్రకారం రొటీన్ చెకప్ లు చేశారు. ఆ పరీక్షల్లో ఇద్దరికీ పాజిటివ్ రావడంతో కేంద్ర ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. చైనాలో కేసులు పెరుగుతుండటంపై రెండ్రోజుల క్రితమే దేశవ్యాప్త అప్రమత్తతను ప్రకటించిన కేంద్రం.. తాజా కేసులతో దిద్దుబాటు చర్యలకు దిగింది. 8 నెలల బేబీలో ఈ నెల 3న వ్యాధి నిర్ధరణైంది. ఈ చిన్నారుల కుటుంబ సభ్యులకు ఎలాంటి విదేశీ చరిత్ర లేకున్నా వ్యాధి బయటకు రావడం వైద్య వర్గాల్ని షాక్ కు గురిచేసింది.