వన్డేల్లో జట్టంతా కలిసి 300 పరుగులు చేస్తే భారీ స్కోర్ అంటాం. కానీ ఒక్కరే 157 బంతుల్లో 346 పరుగులు చేస్తే మరేమనాలి. ఆ క్రికెటర్ దూకుడుకు టీమ్ స్కోరు 563కు చేరుకుంది. అంతలా చెలరేగి ఆడిందా మహిళా క్రికెటర్. వన్డే క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ట్రిపుల్(Triple) సెంచరీతో సంచలన ఇన్నింగ్స్ ఆడిన ఆమెనే ఇరా జాదవ్. ముంబయికి చెందిన ఈ చిన్నది.. మహిళల అండర్-19 ట్రోఫీలో ఈ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ముంబయి-మేఘాలయా మధ్య బెంగళూరులోని ఆలూర్ స్టేడియంలో జరిగిన మ్యాచులో సంచలన ఇన్నింగ్స్ రికార్డయింది. జాదవ్ బ్యాటింగ్ లో 42 ఫోర్లు, 16 సిక్సులు ఉండగా.. 346 వ్యక్తిగత స్కోరులో 264 పరుగులు ఫోర్లు, సిక్సుల నుంచే వచ్చాయంటే ఎంతటి విధ్వంసం సృష్టించిందో అర్థమవుతుంది. ఇక ఆమె స్ట్రైక్ రేట్ 220.38 కాగా.. రెండో వికెట్ కు కెప్టెన్ హర్లీ గాలాతో కలిసి 274 రన్స్ పార్ట్నర్ షిప్ ఇచ్చింది. జాదవ్ ధాటికి బౌలర్లు జయశ్రీ (2/100), అవేస(1\125) పరుగులు సమర్పించుకున్నారు.