ప్రియుడికి మత్తు మందు ఇచ్చి అవయవాలన్నీ పాడై పోయేలా ప్రాణాలు తీసిన కేసులో కేరళలోని నెయ్యట్టింకర సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 23 ఏళ్ల ప్రియుణ్ని హత్య చేసిన గ్రీష్మ అనే యువతికి ఉరి శిక్ష, ఆమె మేనమామ నిర్మలాకుమరన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అసలేం జరిగిందంటే…
జరిగిందిలా…
పరసాల ప్రాంతానికి చెందిన షరోన్ రాజ్, గ్రీష్మ ప్రేమించుకున్నారు. ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయం కాగా, వారిద్దరి మధ్య దూరం పెరిగింది. వృత్తిరీత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్ 2022 అక్టోబరు 10న పరసాలకు వచ్చాడు. అదే నెల 14న షరోన్ కు ఫోన్ చేసి కలవాలని ఉందని, బయటకు వెళ్దామని చెప్పిందామె. దీంతో అతడు ఫ్రెండ్ తో కలిసి తమిళనాడులోని రామవర్మంచిరై వెళ్లాడు. స్నేహితుణ్ని బయటే ఉంచి లోపలికి వెళ్లి వాంతులు చేసుకుంటూ వచ్చాడు. హాస్పిటల్ కు తీసుకెళ్తున్న సమయంలోనే చాట్ చేసిన షరోన్.. కషాయంలో ఏం కలిపావంటూ ఆమెను నిలదీస్తే బహుశా వికటించిందేమో అని జవాబిచ్చింది. అక్కడితో ఛాటింగ్ ఆగిపోగా, నీలిరంగులో వాంతులు చేసుకున్న యువకుడికి పరసాలాలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించగా, బ్లడ్ టెస్ట్ రిపోర్టులు నార్మల్ గా ఉండటంతో ఇంటికి పంపించారు.
చివరకు…
కానీ రెండ్రోజుల తర్వాత షరోన్ పరిస్థితి విషమించడంతో తిరిగి అదే ఆసుపత్రికి తరలించారు. ఆ లోపే అతడి ఊపిరితిత్తులు, కిడ్నీ దెబ్బతినగా ఇందుకు పురుగుల మందు కలిపిన డ్రింకే కారణమని తేలింది. అవయవాలన్నీ పాడైపోయి అక్టోబరు 25న షరోన్ గుండెపోటుతో ప్రాణం విడిచాడు. అతడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేయగా, గ్రీష్మ కుటుంబం పరారైంది. నవంబరు 22న గ్రీష్మ కుటుంబ సభ్యుల్ని అరెస్టు చేయగా, పోలీస్ స్టేషన్లోనే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. షరోన్ స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు జరిగింది. కేవలం యువకుణ్నే గ్రీష్మ చంపలేదని, ప్రేమ అనే భావోద్వేగంతో ప్రాణాన్ని బలి తీసుకుందని తీర్పులో కోర్టు ప్రస్తావించింది.