అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కేవలం ఆరు గంటల్లోనే 80 దాకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్.. అక్కడి భారతీయులకు ఝలక్ ఇచ్చారు. అమెరికా పౌరులు(Citizens) కాకున్నా తమ గడ్డపై పుట్టే పిల్లలకు సహజంగా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికీ సహజంగా దక్కే దేశ పౌరసత్వ విధానం వంద సంవత్సరాలుగా అమల్లో ఉంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలు, టూరిస్ట్ లేదా స్టూడెంట్ వీసాలపై వచ్చి యునైటెడ్ స్టేట్స్(US)లో కాన్పు వల్ల పుట్టిన పిల్లలకు ఇప్పటిదాకా పౌరసత్వ నియమం అమల్లో ఉంది. కానీ ఈ విధానాన్ని ట్రంప్ రద్దు చేయడంతో ఇక విదేశీ మహిళలు అమెరికాలో ప్రసవించినా వారి శిశువులు పొందే పౌరసత్వ హక్కు దక్కకుండా పోయింది.
తల్లిదండ్రుల్లో(Parents) ఒకరైనా US సిటిజన్ షిప్, శాశ్వత నివాసి లేదా యూఎస్ మిలిటరీ సభ్యత్వం ఉండాలి. ఇలా ఏదో ఒక గుర్తింపు లేని వారి సిటిజన్ షిప్.. తాజా ఆదేశాలతో రద్దవుతుంది. 2024 గణాంకాల ప్రకారం అగ్రరాజ్యంలో 5.4 మిలియన్ల(54 లక్షల మంది) భారతీయ సంతతి వారున్నారు. అంటే అక్కడి జనాభాలో 1.47 శాతం మంది మనవారన్నమాట. భారతీయులతోపాటు చైనీయులు సైతం లక్షల సంఖ్యలో USలో ఉండగా, ట్రంప్ తాజా నిర్ణయంతో ఈ రెండు దేశాలకు చెందిన లక్షల మంది అమెరికాను వీడే అవకాశాలున్నాయి.