హైదరాబాద్ సరూర్ నగర్లోని అలకనంద ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. అక్రమ మార్పిడి దందాలో కిడ్నీ ఇచ్చిన దాతలు, వాటిని స్వీకరించిన వ్యక్తుల నుంచి పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల కమిటీ ఆయా వ్యక్తులపై విచారణ చేపట్టి వివరాలు రాబట్టింది. కిడ్నీ దానం చేసిన వ్యక్తులు మహిళ పేరును ప్రస్తావించారని, ఆర్థిక కారణాలతోనే ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని తేలింది. అయితే వాటిని ఇచ్చిన మహిళలిద్దరూ వితంతువులుగా గుర్తించిన వైద్య బృందం… కిడ్నీ రాకెట్ ముఠా పన్నాగాల్ని బయటకు తీసుకువచ్చింది.
పొరుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి వ్యవహారం నడిపిస్తున్నారని గుర్తించింది. కిడ్నీ దాతలు(Donors), స్వీకరించిన వ్యక్తులు(Receivers) తమిళం, కన్నడ భాషలు మాట్లాడుతున్నారని కమిటీ సభ్యులు నిర్ధారణకు వచ్చారు. పర్మిషన్ లేకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయన్న సమాచారంతో రంగారెడ్డి జిల్లా అధికారులు దాడులు చేశారు. 6 నెలల క్రితమే అలకనంద హాస్పిటల్ ప్రారంభం కాగా.. అధికారులు దాడులు చేసిన సమయంలో కిడ్నీకి సంబంధించి నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.