IPLలో అదరగొట్టిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంటర్నేషనల్ మ్యాచులోనూ దుమ్మురేపాడు. ఇంగ్లండ్ తో తొలి టీ20లో రెచ్చిపోయి ఆడటంతో ఆ జట్టు ఘోర పరాజయం పాలైంది. కేవలం 20 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, 6 సిక్సర్లతో ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు. ఇంగ్లండ్ విధించిన 133 పరుగుల టార్గెట్ ను టీమ్ఇండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. కేవలం 12.5 ఓవర్లలోనే మూడు వికెట్లకు 133 రన్స్ చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. భారత్ బ్యాటింగ్ లో తొలుత శాంసన్(26) ధాటి(Fast)గా ఆడితే అభిషేక్(79; 34 బంతుల్లో 5×4, 8×6) నిదానించాడు. కానీ శాంసన్ ఔటైన తర్వాత దుమ్ముదులుపుతూ ఫోర్లు, సిక్సులతో అలరించాడు.
సూర్యకుమార్(0)కే వెనుదిరిగినా ఆ ప్రభావం ఎక్కడా కనపడనీయకుండా ఆడాడు అభిషేక్. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఔటయ్యే సరికి.. భారత్ కు కేవలం 8 పరుగులే కావాల్సి వచ్చింది. తిలక్(19 నాటౌట్), హార్దిక్(3 నాటౌట్)గా మిగిలారు. అంతకుముందు కెప్టెన్ బట్లర్ అండతో ఇంగ్లిష్ టీమ్ 132 స్కోరు చేయగలిగింది. వరుణ్ 3, అర్షదీప్, అక్షర్, పాండ్య రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు. ఈ విజయంతో 5 మ్యాచుల సిరీస్ లో టీమ్ఇండియా 1-0తో నిలిచింది.