ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) నయా రికార్డులతో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టీ20లో 133 పరుగుల టార్గెట్ ను 34 బంతుల్లోనే 79 రన్స్ తో ఊదిపడేసిన అతడు మరిన్ని రికార్డుల్ని తన పేరిట వేసుకున్నాడు. తన మెంటార్ అయిన యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలోనే రాటు దేలుతూ చివరకు అతడి రికార్డుల్నే బ్రేక్ చేశాడీ లెఫ్ట్ హ్యాండర్.
ఆ రికార్డులివే…
* భారతగడ్డపై టీ20ల్లో అత్యంత వేగవంతమైన ఇన్నింగ్స్(70+ పరుగులు) ఆడిన ఘనత సాధించాడు. ఇప్పటిదాకా ఇది దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ పేరిట ఉంది. అతడు 2022లో గువాహటిలో జరిగిన మ్యాచులో 225.53 స్ట్రైక్ రేట్ తో 106 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తాజా మ్యాచులో 232.35 స్ట్రైక్ రేట్ తో అభిషేక్ 79 రన్స్ చేసి మిల్లర్ రికార్డును బ్రేక్ చేశాడు.
*టీ20ల్లో ఇంగ్లండ్ పై రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన భారత ప్లేయర్ గా అభిషేక్ ఘనత దక్కించుకున్నాడు. 2018లో మాంఛెస్టర్లో జరిగిన మ్యాచులో కేఎల్ రాహుల్ 27 బంతుల్లో ఫిఫ్టీ చేస్తే, ఇప్పుడు శర్మ 20 బాల్స్ లోనే పూర్తి చేశాడు. ఫాస్టెస్ట్ టీ20 రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 2007 టీ20 ప్రపంచకప్ లో యువీ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
* ఇంగ్లండ్ పై టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డూ అభిషేక్ సొంతమైంది. ఇప్పటిదాకా ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిటే ఉంది. 2007 టీ20 వరల్డ్ కప్ లో యువీ 7 సిక్సర్లు కొట్టగా తాజా మ్యాచులో ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.