రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. ఎప్పుడిస్తారో అంటూ గత కొన్నేళ్ల నుంచి నిరీక్షిస్తూనే ఉన్నారు. ఈ గణతంత్ర దినోత్సవం(జనవరి 26) నుంచి కొత్త కార్డులు ఇస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించడం, ఇందుకోసం గ్రామ, వార్డు సభలు ఏర్పాటు చేసి అప్లికేషన్లు తీసుకోవడం చూస్తున్నాం. అయితే సభల్లో దరఖాస్తు చేసుకుంటేనే కొత్త కార్డులు వస్తాయి, లేదంటే కష్టమే అన్న భావన చాలా మందిలో ఉంది. కానీ దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రత్యేక గడువు(Time Limit) అంటూ ఏం లేదని ప్రకటించిన ఆయన.. నిరంతరం వాటిని జారీ చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తేబోతున్నామన్నారు. కొత్తగా కేటాయించే వాటితోపాటు పాత కార్డుల్లో మార్పులు, చేర్పుల వంటివన్నీ ఇకనుంచి ఈ సాఫ్ట్ వేర్ ఆధారంగానే జరగనున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం కార్డుల సంఖ్య 89.98 లక్షలు కాగా గతంలోనే 11 లక్షల కొత్త అప్లికేషన్లు వచ్చాయి. ఇపుడున్న కార్డుల్లో రేషన్ తీసుకోని వ్యక్తులు 11 శాతం ఉండగా, తాజా గ్రామ సభల్లో నాలుగు స్కీంలకు కలిపి 10.9 లక్షల దరఖాస్తులు అందాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించే సభలకు గాను కేవలం రెండ్రోజుల్లోనే 10.9 లక్షల అప్లికేషన్లు రాగా, మరో రెండ్రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.