అగ్రరాజ్యంలో ఆస్పత్రులకు గర్భిణుల పరుగు… నెలలు నిండకుండానే ప్రసవాలు… ఇలా ట్రంప్ విధానాలతో భారతీయ మహిళలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. తమ దేశంలో జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ గద్దెనెక్కగానే ఉత్తర్వు జారీచేయడంతో మరో నెల రోజుల్లోపే(ఫిబ్రవరి 20) ఇది అమల్లోకి రానుంది. ఈ ఆదేశాలు అక్కడి భారతీయ మహిళల్ని హాస్పిటళ్లకు పరుగులు పెట్టిస్తున్నాయి. నెలలు నిండకుండానే సిజేరియన్ ద్వారా పిల్లల్ని కనేందుకు దంపతులు తొందరపడటంతో దవాఖానా(Hospitals)ల వద్ద క్యూ ఏర్పడింది. ముందస్తు డెలివరీల(Pre Delivery) వినతులు అక్కడి డాక్టర్లకు ఎక్కువయ్యాయట. ఏడో నెల గర్భిణి అయిన భారతీయ మహిళ ఒకామె ముందస్తుగా సిజేరియన్ చేయాలంటూ డాక్టర్ ను సంప్రదించారు. నిజానికి ఆమె మార్చిలో ప్రసవించాల్సి ఉండగా.. ట్రంప్ విధించిన గడువు ఫిబ్రవరి 20తో ముగుస్తుంది. ఆ తర్వాత కాన్పు జరిగితే పుట్టే బిడ్డకు అమెరికా పౌరసత్వం దక్కదన్న భయం మనవాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.
నెలలు నిండకుండా పుట్టే శిశువుల్లో ఊపిరితిత్తుల ఎదుగుదల లోపం, తక్కువ బరువు వల్ల నాడీసంబంధ సమస్యలు ఏర్పడటం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరికీ క్షేమం కాదని డాక్టర్లు అంటున్నారు. H1-B వీసాపై భర్త ఉద్యోగం చేస్తుంటే భార్య సైతం అక్కడే ఉండటం చూస్తుంటాం. గ్రీన్ కార్డుల కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. ఇప్పుడీ ట్రంప్ నిర్ణయంతో ఉన్నదానికే ఎసరు వస్తుండటంతో ముందస్తు డెలివరీలే మేలన్న అభిప్రాయానికి వస్తున్నారు దంపతులు. ఇలా జన్మతః పౌరసత్వ హక్కు కోసం పరాయి దేశంలో ప్రాణాల్నే పణంగా పెడుతున్నారు మన మహిళలు.