ఉన్నవారు ఉన్నట్లు గంటల వ్యవధిలోనే పిట్టల్లా రాలిపోయారు.. ఏం జరిగిందో తెలుసుకునేలోపే 17 మంది మృత్యువాత పడ్డారు. డిసెంబరు 7 నుంచి జనవరి 19 వరకు 3 కుటుంబాల్లో మృత్యువు విలయతాండవం చేసిన జమ్మూకశ్మీర్ రాజౌరి జిల్లాలో జరిగిన ఘటనలో నిజాలు బయటపడుతున్నాయి. ఈ మిస్టరీ మరణాలకు అంటువ్యాధులన్న ప్రచారాన్ని కేంద్రం కొట్టిపడేసింది. కేవలం విషపదార్థాల(Poisonized) వల్లే ఇలా జరిగినట్లు.. ఎలాంటి ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, వైరల్ లేవని తేల్చారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వైద్య బృందాలు నమూనాల్ని లఖ్‌నవూలోని CSIR ల్యాబ్ కు పంపించి పరీక్షించాయి. ఆ నమూనాల్లో విషపదార్థాలు కనిపించగా, ఏదైనా కుట్ర కోణం ఉందా అన్నదానిపై దర్యాప్తు జరుగుతోంది.
రాజౌరిలోని బధాల్ గ్రామంలో వరుస మరణాలు సంభవించడంతోపాటు మరో నలుగురు ప్రాణాలతో పోరాడుతున్నారు. జ్వరం, నొప్పులు, స్పృహ కోల్పోవడం వంటి వాటితో ఆయా కుటుంబాలకు చెందిన మరింతమంది చికిత్స తీసుకుంటున్నారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన JK ప్రభుత్వం కరోనా పరిస్థితుల తరహాలో నిషేధాజ్ఞలు విధించింది. అనుమానాస్పద మరణాలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 11 మంది సభ్యులతో టీమ్ ఏర్పాటు చేసింది. అంటువ్యాధులు లేనేలేవని, ఆహార పదార్థాల్లో విషాన్ని గుర్తించినట్లు తేల్చిన వైద్యులు.. మరికొద్దిరోజుల్లో పూర్తి విషయాలు తెలుస్తాయంటున్నారు.