58కి మూడు వికెట్లు.. మరో 20 పరుగులు చేరాయో లేదో ఇంకో రెండు వికెట్లు.. ఇలా 78 స్కోరుకే 5 ప్రధాన వికెట్లు కోల్పోయిన భారత్.. ఇంగ్లండ్ తో రెండో టీ20లో కష్టంగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. తిలక్ వర్మ ఒంటరి పోరాటం, చివర్లో రవి బిష్ణోయ్ సమయోచిత బ్యాటింగ్ తో విజయం సొంతమైంది. 166 టార్గెట్ తో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. మరో 4 బాల్స్ మిగిలి ఉండగానే 166/8తో నిలిచి రెండు వికెట్ల తేడాతో అపురూప విజయం సాధించింది. తొలుత శాంసన్(5), అభిషేక్(12), సూర్య(12), జురెల్(4), హార్దిక్(7) ఔటవగా.. బాధ్యతంతా తిలక్(72; 55 బంతుల్లో 4×4, 5×6)పై పడింది. మరో ఎండ్ లో ఉన్న వాషింగ్టన్.. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో రెచ్చిపోయాడు. మార్క్ వుడ్ వేసిన ఆ ఓవర్లో నోబాల్ కు వచ్చిన ఫ్రీ హిట్ ను సిక్సర్ గా మలిచాక, ఆ తర్వాతి రెండు బాల్స్ ను బౌండరీకి పంపాడు. దీంతో కీలక సమయంలో ఒకే ఓవర్లో 18 పరుగులు రావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.
కానీ సుందర్(26), అక్షర్(2) వెంటవెంటనే ఔటవడంతో సూర్య సేన మరోసారి కష్టాల్లో పడింది. కానీ తిలక్ వర్మ సిక్స్, రెండు ఫోర్లు కొట్టడంతో 16వ ఓవర్లో 19 రన్స్ వచ్చాయి. అంతకుముందు టాస్ ఓడిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఫస్ట్ మ్యాచ్ మాదిరిగానే కెప్టెన్ బట్లర్(45) ఈ మ్యాచులోనూ టీంలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్రైడెన్ కార్సె(31), జేమీ స్మిత్(22) మినహా ఎవరూ పెద్దగా ఆడకపోవడంతో ఇంగ్లిష్ జట్టు 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఈ గెలుపుతో 5 మ్యాచుల సిరీస్ లో భారత్ 2-0తో ఉంది.