భారత బౌలర్ల ధాటికి కుర్రాళ్లతో కూడిన వెస్టిండీస్(West Indies) కకావికలమైంది. అనుభవజ్ఞుల లేమి విండీస్ జట్టులో కొట్టొచ్చినట్లు కనిపించింది. తొలి ఇన్నింగ్స్ లో 150 రన్స్ కే ఆలౌట్ అయిన ఆ జట్టు… రెండో ఇన్నింగ్స్ లో 130 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో టీమ్ఇండియా తొలి టెస్టు(First Test)లో ఇన్నింగ్స్ 141 రన్స్ తేడాతో విజయం సాధించి సిరీస్ లో 1-0తో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో కరీబియన్ జట్టులో ఒక్కరంటే ఒక్కరు గట్టిగా నిలబడలేదు. రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలానికి ఆ జట్టు కోలుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన అశ్విన్… ఈ ఇన్నింగ్స్ లోనూ(7/71) ప్రత్యర్థి జట్టు వెన్నువిరిచాడు. ఆ జట్టులో అథనేజ్(28) టాప్ స్కోరర్ కాగా… జేసన్ హోల్టర్(20), జోమెల్ వెరికాన్(28), జోషువా డ సిల్వా(13), రహీమ్ కార్న్ వాల్(13) అంతా తక్కువ స్కోరుకే ఔటయ్యారు.
అంతకుముందు 312/2తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్.. 5 వికెట్లకు 421 రన్స్ వద్ద డిక్లేర్డ్ చేసింది. అరంగేట్ర మ్యాచ్ లోనే అదరగొట్టిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. దీంతో వెస్టిండీస్ పై తొలి ఇన్నింగ్స్ లో 271 పరుగుల లీడ్(Lead) సాధించింది. జైస్వాల్(171; 383 బంతుల్లో, 16×4, 1×6) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి(76; 182 బంతుల్లో, 5×4) యశస్వికి అండగా నిలిచాడు. అజింక్యా రహానే(3) త్వరగానే ఔట్ కాగా… రవీంద్ర జడేజా(37 బ్యాటింగ్), ఇషాన్ కిషన్(1) క్రీజులో ఉండగానే ఇన్నింగ్స్ ను రోహిత్ డిక్లేర్ చేశాడు. 271 పరుగులు వెనుకబడ్డ విండీస్… రెండో ఇన్నింగ్స్ లో ఆ స్కోరులో సగమైనా చేయకుండానే మ్యాచ్ ను భారత్ కు అప్పగించింది. రవీంద్ర జడేజా 2 వికెట్లు తీసుకున్నాడు.
Great victory ✌️✌️
Nice coverage