కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ సుంకాల(Customs Tariffs)ను తగ్గించడం ద్వారా ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. సుంకాలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు నిర్మల ప్రకటించడంతో.. నగలు, వాటి తయారీదారులకు ప్రయోజనం కలిగే అవకాశముంది. విలువైన లోహంతో తయారయ్యే ఆభరణాలపై కస్టమ్స్ సుంకాన్ని 25% నుంచి 20 శాతానికి తగ్గిస్తున్నారు. దీనికి అదనంగా ప్లాటినం ఆభరణాల(Jewelry) తయారీలో ఉపయోగించే వస్తువులపై సుంకాన్ని పెద్దమొత్తంలో 25% నుంచి 5 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయం రేపటి(ఫిబ్రవరి 2) నుంచి అమలు కానుంది. కస్టమ్స్ సుంకాల తగ్గింపుతో ఆభరణాల ధర తగ్గి, కస్టమర్లకు తక్కువ రేటుకే లభించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. లగ్జరీ నగలు కొనే వినియోగదారులకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది.
డిమాండ్ పెరిగేలా…
ఆభరణాలు చౌకగా మారడం వల్ల దేశీయంగా డిమాండ్ పెరిగే అవకాశముంది. తద్వారా దేశంలో తయారయ్యే నగల అమ్మకాల వృద్ధికి తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు. ప్లాటినం వస్తువులపై తగ్గింపు వల్ల తయారీదారుల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. రత్నాలు, నగల తయారీదారులకు ప్రయోజనం చేకూర్చనుంది. నిర్మల ప్రకటన తర్వాత ఆభరణాల షేర్లు భారీగా పెరిగాయి.