MLAల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కటొక్కటిగా కాకుండా రెండు పిటిషన్లను కలిపి విచారించనుంది. మాజీ మంత్రి KTR పిటిషన్ ను ఈరోజు వాయిదా వేసిన కోర్టు.. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్ తో కలిపి విచారణ చేపట్టనుంది. MLAలపై చర్యలకు స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ జనవరి 29న KTR పిటిషన్ వేశారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ప్రస్తుతం విచారణ నడుస్తోంది. వీటిని వేర్వేరుగా కాకుండా కలిపే విచారణ చేపడతామని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ద్విసభ్య ధర్మాసనం(Devision Bench) స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 10న విచారణ జరగనుంది.
కౌశిక్ SLPపై జస్టిస్ గవాయ్, జస్టిస్ జార్జ్ మసీహ ధర్మాసనం జనవరి 31న విచారణ జరిపింది. 4 నెలల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను హైకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదని పిటిషనర్ వివరించారు. అయితే ఇప్పటికే నోటీసులు ఇచ్చారని, తొందరపాటు తగదంటూ అసెంబ్లీ కార్యదర్శితోపాటు స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన బెంచ్.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారంటూ, మహారాష్ట్రలా పదవీకాలం పూర్తయ్యేదాకా ఎదురుచూస్తూనే ఉండాలా అని తెలంగాణ స్పీకర్ పై అసహనం చెందింది.