అరవింద్ కేజ్రీవాల్… ఐఐటీ ఖరగ్ పూర్లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివి, మేటి అయిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్(IRS)లో సేవలందించిన వ్యక్తి. హరియాణాలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ‘జన లోక్ పాల్’ బిల్లు కోసం అన్నాహజారేతో కలిసి పనిచేశారు. ఇంజినీరింగ్ కాగానే టాటా స్టీల్ కంపెనీలో 1989లో చేరి 1992లో జాబ్ మానేశారు. అప్పుడే సివిల్స్ రాసి IRS సాధించి ఆదాయపన్ను జాయింట్ కమిషనర్ గా చేరారు. సమాచార హక్కు చట్టం కోసం చేసిన పోరాటంతో దేశవ్యాప్తంగా హీరో అయ్యారు. స.హ.చట్టం సాకారం, పేదల స్థోమత పెంచేందుకు ఏర్పాటైన ‘పరివర్తన్’ సేవలతో 2006లో కేజ్రీవాల్ కు రామన్ మెగసెసే అవార్డు దక్కింది. అంతటి ఘన చరిత్ర గల ఆయన.. 2012లో రాజకీయాల్లోకి దిగారు. కేవలం ఏడాది కాలం(2013)లోనే పీఠం సాధించి ఢిల్లీ 7వ CMగా పదవి చేపట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసినవారిలో ఆయనే అత్యంత పిన్న వయస్కుడు.
ఆయన ఘనతలివే…
2012లో స్వరాజ్ అనే పుస్తకాన్ని రచించిన కేజ్రీవాల్.. పురస్కారాల్లోనూ మేటిగా నిలిచారు. 2004లో అశోకా ఫెలో అవార్డు, 2005లో సత్యేంద్ర దుబే, 2006లో రామన్ మెగసెసే, అదే ఏడాది సంఘ సేవకు గాను ఇండియన్ ఆఫ్ ది ఇయర్, 2009లో ప్రత్యేక నాయకత్వ అవార్డ్, 2010లో పాలసీ ఛేంజ్ ఏజెంట్ ఆఫ్ ది ఇయర్, 2011లో NDTV ఇండియన్ ఆఫ్ ది ఇయర్, 2013లో CNN-IBN ఇండియన్ ఆఫ్ ది ఇయర్, 2014లో టైమ్ పత్రిక ‘టైమ్100’ పోల్ విజేత అవార్డుల్ని గెలుచుకున్నారు. స.హ.చట్టంతో ప్రభుత్వాల్ని గడగడలాడించారు.
కానీ ఆ తర్వాత…
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ ను 2024 మార్చి 21న ED అరెస్టు చేసింది. CM పదవిలో ఉండి అరెస్టయిన తొలి వ్యక్తిగా నిలిచిపోయారు. అయితే ఆయనకు 2024 జూన్ 1 వరకు బెయిల్ ఇస్తూ మే 10న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సెప్టెంబరు 15న పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించి అదే నెల 17న దిగిపోయారు. ఆయన పరపతిని ఢిల్లీ లిక్కర్ స్కాం బాగా దెబ్బతీసింది. కేజ్రీవాల్ కు తమతో ఉన్న పరిచయాన్ని ఖలిస్థాన్ వేర్పాటువాదుల నేత బహిరంగంగా ప్రకటించడం, జైల్లోనే చంపేస్తామనడం సంచలనంగా మారాయి. మొన్నటిదాకా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం నుంచి ఇప్పుడు మాట, చేత దారి తప్పాయి అనే స్థాయికి చేరుకోవడంతో కేజ్రీవాల్ కోట కూలిపోయేలా చేసింది.