కోట్లాది మంది అమృత స్నానాలు ఆచరిస్తున్న మహాకుంభామేళా.. వందల కిలోమీటర్ల మేర జనంతో కిటకిటలాడుతున్నది. ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమానికి చేరుకునేందుకు కోట్లాదిగా భక్తులు తరలివస్తుండటంతో.. 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ సమీప రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హరియాణా, పంజాబ్ తోపాటు దక్షిణాది రాష్ట్రాల దారుల్లో రద్దీ ఏర్పడింది. నిన్న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్లో యాత్రికుల వాహనాలు ముందుకు కదలడానికి 5 గంటలు పట్టింది. అలా 5 గంటల పాటు ఎక్కడికక్కడే వాహనాల్లో యాత్రికులు ఉండిపోవాల్సి వచ్చింది. గత మూడు రోజుల నుంచి దారులన్నీ ప్రయాగ్ రాజ్ వైపే అన్నట్లు ఉండటంతో గంగ, యమున, సరస్వతి నదుల సంగమానికి అనుకున్న టైంకు చేరుకోలేకపోతున్నారు. తాకిడి తట్టుకోలేక ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ ను శుక్రవారం వరకు మూసివేశారు. ఒక్కో యాత్రికుడు స్నానమాచరించేందుకు 48 గంటల పాటు ట్రాఫిక్ లోనే ఉండిపోతున్నారు.