కేసులుంటే ఉద్యోగమివ్వరు.. అది ప్రజాప్రతినిధులకు వర్తించదా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల్లో దోషిగా తేలితే వేటు వేయాలంటూ పిల్(PIL) దాఖలైంది. దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం(Bench) ప్రశ్నలు సంధించింది. 42% మంది లోక్ సభ సభ్యులపై క్రిమినల్ కేసులున్నాయని అమికస్ క్యూరీ(కోర్టు సహాయకుడు) విజయ్ హన్సారియా తెలిపారు. ఆయన అందజేసిన రిపోర్టును బెంచ్ పరిశీలించింది. కొన్నిచోట్ల 3 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. అయితే కేసును CJI నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
వీటికోసం ప్రత్యేక కోర్టులు లేకపోగా, నేతలు న్యాయస్థానాలకు రాకపోవడం జాప్యానికి కారణమన్నారు అమికస్ క్యూరీ. ఎంతోమందిపై రేప్, మర్డర్, కిడ్నాప్, డ్రగ్స్ కేసులున్నాయన్నారు. 2024 పూర్తయ్యేనాటికి మొత్తం 4,732 కేసులున్నట్లు గుర్తుచేశారు. 251 మంది సిట్టింగ్ MPలపై కేసులుంటే అందులో 170 తీవ్రమైనవన్నారు. ఏడాదిలోనే కొత్తగా 892 కేసులు నమోదయ్యాయి. 2016లో వేసిన పిల్ పై ముగ్గురు సభ్యుల బెంచ్ 2023 నవంబరు 9న తీర్పునిచ్చింది. అయితే ఇప్పుడు ఈ కేసు రీ-ఓపెన్ అయింది.
తాజా సూచనలివి…
* సుప్రీం, హైకోర్టులు ఆదేశిస్తున్నా విచారణ జాప్యం అయ్యేలా ట్రయల్ కోర్టులు వాయిదాలు వేస్తున్నాయి. దశాబ్దాల పాటు సాగుతుండటంతో నేతలే ముందుకు వెళ్లనివ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు మరోసారి దృష్టిపెట్టాలి.
* కేసుల విచారణను హైకోర్టుల వెబ్ సైట్లలో ఉంచాలి.
* ప్రత్యేక కోర్టుల్లో కేవలం ప్రజాప్రతినిధులపై మాత్రమే విచారణ చేపట్టాలి. అవి ముగిసిన తర్వాతే ఇతర కేసులు చూడాలి.
* మూడేళ్లకు పైబడి పెండింగ్ లో ఉంటే ఆ కేసులపై రోజువారీగా విచారణ జరగాలి.
* నిందితులు కంటిన్యూగా రెండు వాయిదాలకు రాకపోతే నాన్-బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలి.