చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు(Priest) CS రంగరాజన్ పై దాడి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామరాజ్యం ఆర్మీ పేరిట ఏర్పాటైన సంస్థ.. రెండు రాష్ట్రాల్లో కార్యకలాపాలను విస్తరించబోయింది. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాల్ని చేర్చారు పోలీసులు. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రాజరాజ్యం ఆర్మీ ఏర్పాటైంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి రూ.1.20 లక్షలకు పైగా డొనేషన్లు వచ్చాయి. 20 నుంచి 50 ఏళ్ల లోపు వ్యక్తులకు మాత్రమే సభ్యత్వం(Membership) ఇస్తున్నారు. అలా చేరినవారికి ప్రతి నెలా రూ.20 వేల జీతంతోపాటు వసతి కల్పిస్తామని చెబుతున్నారు. రామరాజ్యం ఆర్మీ 2024 సెప్టెంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు రిజిస్ట్రేషన్లు చేయగా, ఒక్కోదానికి రూ.350 దాకా వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఆలయాలకు చెందిన లక్షల ఎకరాలు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని రక్షించాలన్నది రామరాజ్యం ఆర్మీ లక్ష్యం. అలా హిందూ ధర్మ రక్షణకు తమ ఆర్మీలో చేరాలంటూ వీరరాఘవరెడ్డి ప్రచారం చేస్తున్నారు. కొంతమందితో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకుని ఆర్థిక మద్దతు ఇవ్వాలని, సభ్యుల్ని చేర్పించాలని ఒత్తిడి తెచ్చాడు. ఒప్పుకోకపోవడంతో ప్రధాన పూజారిపై దాడికి దిగారు.