భారత పర్యటనలో ఇంగ్లండ్ దారుణంగా చిత్తయింది. టీ20 సిరీస్ ను 4-1 తేడాతో ఆతిథ్య జట్టుకు అప్పగించగా, వన్డే సిరీస్ ను 3-0తో చేజార్చుకుంది. మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. 356కు ఆలౌటైంది. గిల్ సెంచరీ.. కోహ్లి, శ్రేయస్ హాఫ్ సెంచరీలతో భారీ స్కోరు నమోదైంది. అనంతరం పెద్ద టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టు.. ఎక్కడా పోటీనిచ్చే పరిస్థితిలో కనిపించలేదు. తొలి వికెట్ కు సాల్ట్(23)-డకెట్(34) అందించిన పార్ట్నర్ షిపే(60) హయ్యెస్ట్ కావడం విశేషం. బాంటన్(38), రూట్(24), బ్రూక్(19), కెప్టెన్ బట్లర్(6), లివింగ్ స్టోన్(9) ఇలా వచ్చి అలా ఔటయ్యారు.
బట్లర్ సేన బ్యాటింగ్ 6 రన్ రేట్ కు పైగా కొనసాగినా బ్యాటర్లు మాత్రం క్రీజులో కుదురుకోలేదు. 174 స్కోరుకే 7 కీలక వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు కథ ముగిసింది. 34.2 ఓవర్లలో 214కు ఆలౌటై 142 రన్స్ తేడాతో ఘోర పరాజయం పాలైంది. అర్షదీప్, హర్షిత్, అక్షర్, హార్దిక్ రెండేసి.. వాషింగ్టన్, కుల్దీప్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. ఆల్ రౌండ్ షోతో టీమ్ఇండియా.. ఇంగ్లండ్ ను వైట్ వాష్ చేసింది.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(112), ప్లేయర్ ఆఫ్ ది సిరీస్(259 రన్స్)ను గిల్ అందుకున్నాడు.