అవినీతి దేశాల జాబితాలో భారత్ 96వ స్థానంలో నిలిచింది. అవినీతి లేని దేశంగా ఫస్ట్ ప్లేస్ లో డెన్మార్క్ నిలిస్తే ఆ తర్వాత వరుసగా ఫిన్లాండ్(Finland), సింగపూర్, న్యూజిలాండ్ 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెబుతూ ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్(TI) నివేదిక విడుదల చేసింది. 2024కు సంబంధించి 180 దేశాలతో కూడిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ను ప్రకటించింది. ప్రభుత్వ రంగాల్లో అవినీతిపై నిపుణులు, వ్యాపారుల అభిప్రాయాలతో రిపోర్ట్ తయారు చేసింది. భారత్ 2024లో 38 పాయింట్లు, 2023 39 పాయింట్లు, 2022లో 40 పాయింట్లు సాధించి స్వల్ప తగ్గుదలను చూపింది.
భారత్ పొరుగు దేశాలైన చైనా 76, శ్రీలంక 121, పాకిస్థాన్ 135, బంగ్లాదేశ్ 149వ స్థానాల్లో ఉన్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా అనేక దేశాల్లో అవినీతి పెరిగిందని నివేదిక తెలిపింది. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, వెనెజులాల్లోనూ అవినీతి పెరిగింది. అమెరికా స్కోరు 69 నుంచి 65 పాయింట్లకు తగ్గి 24 నుంచి 28 స్థానానికి పడిపోయింది. దక్షిణ సూడాన్ కేవలం 8 పాయింట్లతో సోమాలియాను వెనక్కు నెట్టి అవినీతిలో తొలి స్థానం దక్కించుకుంది. ఇక సోమాలియా, వెనెజులా, సిరియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.