మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. NCPని విడిచివెళ్లి ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ సహా కీలక నేతలంతా.. తాజాగా శరద్ పవార్ ని కలిశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ తోపాటు ప్రఫుల్ పటేల్, చగన్ భుజ్ బల్ తదితరులు NCP ప్రెసిడెంట్ తో మీట్ అయ్యారు. ముంబయిలోని YB చవాన్ సెంటర్ లో ఈ భేటీ జరిగింది. జులై 2న షిండే మంత్రివర్గంలో చేరిన తర్వాత శరద్ పవార్ ను ఈ రెబెల్ టీమ్ కలవడం ఇదే మొదటిసారి. శాసనసభ వర్షాకాల సమావేశాలకు ఒకరోజు ముందుగా ఈ భేటీ జరగడం ఇంట్రెస్టింగ్ కలిగేలా చేస్తున్నది. ‘శరద్ పవార్ ఆశీస్సుల కోసమే ఆయన్ను కలిశాం.. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ఆయన్ను కలవడానికి వచ్చాం.. ఇప్పటికీ NCP ఐక్యంగానే ఉంది.. మేం చెప్పినదంతా విన్న శరద్ పవార్ మాత్రం స్పందించలేదు’ అని సీనియర్ లీడర్ ప్రఫుల్ పటేల్ తెలిపారు.
అంతకుముందు అజిత్ పవార్ శుక్రవారం నాడు శరద్ పవార్ ను కలుసుకున్నారు. పవార్ నివాసమైన సిల్వర్ ఓక్ కు చేరుకుని.. తన చిన్నమ్మను పరామర్శించారు. సర్జరీ చేసుకుని హాస్పిటల్ నుంచి తిరిగివచ్చిన శరద్ సతీమణి ప్రతిభా పవార్ ను కలిసి అజిత్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అజిత్ విషయంలో ప్రతిభా పవార్ గతంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. 2019లో పార్టీని వీడి దేవేంద్ర ఫడణవీస్ తో జట్టుకట్టిన అజిత్ ను తిరిగి NCPలోకి తేవడంలో ప్రతిభ మెయిన్ రోల్ పోషించారు.