ఉత్తర తెలంగాణ(North Telangana)లో BJP మరోసారి పట్టు నిరూపించుకుంది. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ MLCగా ఆ పార్టీ బలపరిచిన మల్క కొమురయ్య విజయం సాధించారు. అభ్యర్థుల ఎంపికపై ఇతర పార్టీలు మల్లగుల్లాలు పడుతున్న సమయంలోనే.. కమలం పార్టీ ఏకంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ముందస్తుగా క్యాండిడేట్లను ప్రకటించి అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం BRSకు సవాల్ విసిరింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన పార్టీ నేత అంజిరెడ్డిని పట్టభద్రుల స్థానానికి, విద్యాసంస్థల అధినేత, పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్క కొమురయ్యను టీచర్ స్థానానికి జనవరి 10న ఖరారు చేసింది. ఉత్తర తెలంగాణలో MP, MLA స్థానాల్లో BJPకి గట్టి పట్టుంది. రెడ్డి సామాజికవర్గం నుంచి ఒకరు, BCల నుంచి మరొకరికి సీటు కట్టబెట్టి సమతూకం పాటించిందన్న అభిప్రాయాన్ని కల్పించింది.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ MPలు BJPకి చెందినవారే. 2019 నుంచి ఆ పార్టీ పట్టు పెరుగుతూనే ఉంది. 2023 ఎన్నికల్లో సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, గోషామహల్ అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇందులో గోషామహల్ ను మినహాయిస్తే మిగతా 7 ఉత్తర తెలంగాణలోనివే. రాష్ట్రంలో కాషాయ జెండాకు 8 MP, మరో 8 MLA సీట్లున్నాయి. ఇప్పుడు ఇంకో MLC సైతం వారికి జత కలిశారు. సామాజికవర్గ సమతూకం, అభ్యర్థుల ముందస్తు సెలక్షన్ వారికి కలిసొచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.