వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్.. అందరి అంచనాల్ని నిజం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి విజేతగా నిలిచింది. టోర్నీలో ఓటమనేదే లేకుండా సాగిన జైత్రయాత్ర విజయవంతమైంది. న్యూజిలాండ్ విసిరిన 252 పరుగుల టార్గెట్ ను 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. రోహిత్(76), గిల్(31), అయ్యర్(48), అక్షర్(29) నిలకడగా ఆడి విజయానికి బాటలు వేశారు. 105 స్కోరు వరకూ ఒక్క వికెట్ కోల్పోని టీమ్ఇండియా.. ఆ తర్వాత కుదుపులకు లోనైంది. కానీ రాహుల్(34 నాటౌట్), పాండ్య(18) జోడీ.. గెలుపును సులువు చేసింది. చివర్లో జడేజా(9 నాటౌట్) బౌండరీతో 254/6 చేసిన రోహిత్ సేన.. 4 వికెట్ల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది. 25 ఏళ్ల నాటి ప్రతీకారాన్ని తీర్చుకుంటూ ముచ్చటగా మూడోసారి కప్పును ముద్దాడింది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ను ఓడించి కివీస్ కప్పును దక్కించుకుంది.