గురుకుల విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా TSUTF ధర్నాలు నిర్వహించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్ని కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో 298 గురుకులాలు ఉంటే, తెలంగాణ ఏర్పడ్డాక వాటి సంఖ్య 1,002కు చేరుకుందని.. తద్వారా విపరీతమైన పనిభారం పడుతున్నా తగిన వేతనం, కష్టానికి తగ్గ గుర్తింపు దక్కడం లేదంటూ TSUTF ధర్నాలకు దిగింది. టీచింగ్ తోపాటు కేర్ టేకర్, డిప్యూటీ వార్డెన్, నైట్ స్టే, ఎస్కార్ట్ వంటి అడిషనల్ వర్క్స్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. బోధనేతర పనుల వల్ల మానసిక ఒత్తిడి పెరిగి స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం లేదని బాధపడుతున్నారు. అన్ని గురుకులాల్లో బదిలీలు, ప్రమోషన్ల కౌన్సిలింగ్ షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేసింది.
మొత్తం 26 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిన TSUTF… పోరాటం విజయవంతం కావడానికి అన్ని సొసైటీల్లోని టీచర్స్ ఏకమై ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చింది. ఆగస్టు 5న హైదరాబాద్ లో గురుకుల ఉపాధ్యాయుల మహాధర్నా నిర్వహించాలని గతంలోనే నిర్ణయించగా.. దీన్ని విజయవంతం చేసేందుకు టీచర్లంతా ఏకం కావాలని TSUTF రాష్ట్ర నేతలు జంగయ్య, చావ రవి తదితర నేతలు సూచించారు.
ప్రధాన డిమాండ్లలో కొన్ని…
అన్ని గురుకులాల్లో ప్రిన్సిపల్ పోస్టును గ్రేడ్-1గా అప్ గ్రేడ్ చేయాలి.
విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపుపై ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలి.
అన్నిచోట్ల పర్మినెంట్ బిల్డింగ్స్, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మించాలి.
ప్రతి గురుకులానికి అదనంగా ANMను కేటాయించాలి.
కేర్ టేకర్, డిప్యూటీ వార్డెన్ లను ప్రత్యేకంగా నియమించాలి.
టీచర్లను నైట్ డ్యూటీ నుంచి మినహాయించాలి.
2007లో రెగ్యులరైజ్ అయిన వారికి నోషనల్ సర్వీసు, పాత పెన్షన్ విధానం ఉండాలి.