రూ.13,500 కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి అరెస్టు.. భారత దౌత్య నీతికి నిదర్శనంగా నిలిచింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)ను మోసం చేసి బెల్జియం పారిపోయిన మెహుల్ చోక్సీని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. నీరవ్ మోదీ సన్నిహితుడైన చోక్సీ గీతాంజలి జెమ్స్ గ్రూప్ అధినేత. కరీబియన్ దీవుల్లోని అంటిగ్వా పౌరసత్వమున్న ఆయన.. 2018లో భారత్ నుంచి అదృశ్యమయ్యారు. అప్పుడే ఇంటర్ పోల్ నోటీసుల్ని CBI, ED జారీ చేశాయి. అంటిగ్వా నుంచి బెల్జియం చేరుకున్న చోక్సీ, అక్కణ్నుంచి క్యాన్సర్ వైద్యం కోసం స్విట్జర్లాండ్ వెళ్లాలని ప్లాన్ వేశారు. కానీ ఈ విషయాన్ని పసిగట్టిన దౌత్యాధికారులు.. పూర్తిస్థాయిలో నిఘా పెట్టి కదలకుండా చేశారు. ముంబయి దాడుల ఉగ్రవాది తహవుర్ రాణాను అమెరికా నుంచి రప్పించిన వారానికే చోక్సీని బెల్జియంలో అరెస్టు చేయించడం నిఘా సంస్థల పనితీరుకు అద్దం పట్టింది.