గ్రూప్-1(Group-1) నియామకాల్ని హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది. అయితే ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయొచ్చని తెలిపింది. గ్రూప్-1 మెయిన్స్ రీ-వాల్యుయేషన్ జరిపించాలంటూ కొందరు అభ్యర్థులు గత నెలలో కోర్టును ఆశ్రయించారు. తప్పుడు మూల్యాంకనం(Valuation) జరిగిందని, 18 రకాల సబ్జెక్టులుంటే 12 రకాల సబ్జెక్టు నిపుణులతోనే దిద్దించారని వివరించారు. 3 భాషల్లో పరీక్షలు జరిగినా.. ఒకే రకమైన నిపుణులు తెలుగు, ఇంగ్లిష్ మీడియం పేపర్లు దిద్దడం వల్ల అభ్యర్థులకు నష్టం జరిగిందని కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.