జాతీయ భద్రత(National Security) కోసం ‘స్పైవేర్’ వాడటం తప్పు కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పెగాసెస్ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ బెంచ్.. కేంద్రాన్ని సమర్థించింది. ‘ఇది దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించింది.. మనం ఎదుర్కొంటున్న పరిస్థితి వల్ల జాగ్రత్త పడాలి.. దేశం స్పైవేర్ వాడితే తప్పేంటి.. దాన్ని కలిగి ఉండటంలో ఎలాంటి సమస్య లేదు.. మనం జాగ్రత్తగా ఉండాలి(పహల్గామ్ విషాదాన్ని ప్రస్తావిస్తూ).. దాన్ని ఎవరిపై ఉపయోగించారన్నదే ప్రశ్న.. పౌర సమాజం లేదా వ్యక్తిపై వాడితే పరిశీలిస్తాం..’ అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
ఇజ్రాయెల్ కు చెందిన పెగాసెస్ తో తమను స్నూప్ చేశారని భావిస్తే కోర్టుకు రావొచ్చని సూచించింది. పెగాసెస్ నివేదికను బహిరంగపర్చాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ వినతిని తిరస్కరించింది. ‘దేశ భద్రతకు సంబంధించిన ఏ రిపోర్టునూ మేం తాకబోం.. స్పైవేర్ కు గురైన వారు మాత్రం సందేహాల్ని తీర్చుకోవచ్చు..’ అని తీర్పునిచ్చింది.